: హస్తినలో సరి-బేసి అమలు నేటి నుంచే... కేజ్రీ కేబినెట్ ప్రయాణాలు ఎలాగంటే...!
కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని కాపాడేందుకు ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నడుం బిగించారు. సరి-బేసి పేరిట కొత్త విధానాన్ని రూపొందించిన కేజ్రీ సర్కారు, దాని అమలుకు నేటి నుంచి శ్రీకారం చుడుతోంది. నేడు నగరంలోని దాదాపు సగం కార్లు రోడ్డుపైకి రావు. ఈ క్రమంలో కేజ్రీ కేబినెట్ సభ్యులు తమ కార్యాలయాలకు ఎలా వెళతారు? అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ బేసి నెంబరు గల తన వాహనంలోనే కార్యాలయానికి వెళతారట. కారులో తనతో పాటు తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు గోపాల్ రాయ్, సత్యేందర్ జైన్ లను ఆయన కార్యాలయానికి తీసుకెళతారు. ఇక సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తన కార్యాలయానికి వెళ్లేందుకు సైకిల్ ను వినియోగించనున్నారు. పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆటో ఎక్కనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ బస్సును ఆశ్రయించనున్నారు.