: 'పంచ్'లు విసురుకున్న అయ్యన్న, గంటా!... విశాఖ తీరంలో సరదా సన్నివేశం
విశాఖ తీరంలో నిన్న చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం అక్కడి వారినే కాక విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. టీడీపీ తొలి తరం నేత, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అదే పార్టీకి చెందిన మరో నేత, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కటైపోయారు. విశాఖ తీరం సాక్షిగా సరదాగా పంచ్ లు విసురుకుంటూ బాక్సింగ్ ఆడారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎడతెగని రాజకీయ వైరం నెలకొంది. చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రులుగా ఉన్న వీరిద్దరూ కనీసం ఎదురుపడినప్పుడైనా పలకరించుకున్న దాఖలా కూడా లేదు. అయితే నిన్న మాత్రం వీరిద్దరూ విశాఖ తీరంలో అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. బాక్సింగ్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన అయ్యన్న, గంటాలు చేతులకు గ్లౌస్ తొడుక్కుని ఒకరిపై మరొకరు పంచ్ లు విసురుకున్నారు. అయ్యన్న బ్లూ కలర్ గ్లౌస్ తొడగగా, గంటా మాత్రం రెడ్ కలర్ గ్లౌస్ తొడుక్కుని సరదాగా ముష్టి ఘాతాలు విసురుకున్నారు. ఇక నుంచైనా వీరిద్దరి మధ్య ఇలాంటి వాతావరణం నెలకొంటే... ఒక్క విశాఖకే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా మంచే జరుగుతుందని విశాఖ వాసులు ఆకాంక్షించారు. కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిద్దరూ కలిసి పనిచేస్తే చంద్రబాబుకు అంతకన్నా కావలసింది ఏముంది?