: ఆ పుస్తకాల షాపులో విక్రయాలు సెపరేటు!
ఆ పుస్తకాల షాపులో అమ్మకాలు సెపరేటు! ఎందుకంటే, అన్ని పుస్తకాల షాపుల్లో మాదిరిగా పలు రకాల పుస్తకాలు అక్కడ విక్రయించరు. ఒకే ఒక్క పుస్తకం ప్రతులను వారం రోజులపాటు అమ్ముతారు!. ఈ ప్రతులను ఇష్టమైనవారు కొనుగోలు చేస్తారు. ఇంతకీ, ఆ పుస్తకాల షాపు ఎక్కడుందనుకుంటున్నారు! జపాన్ రాజధాని టోక్యోలోని గింజా జిల్లాలో ఇది ఉంది. దీని యజమాని యోషియుకి మొరియొకా అనే వ్యక్తి. ఈ ఏడాది మేలో ఈ షాపును ప్రారంభించాడు. ఈ ఆలోచన వెనుక గల కారణాల గురించి యోషియుకి వివరించాడు. గతంలో సుమారు 10 సంవత్సరాల పాటు వేరేచోట పుస్తకాల షాపును తాను నడిపినట్లు చెప్పాడు. అప్పుడు అన్నిరకాల పుస్తకాలను విక్రయిస్తుండేవాడినని, కొన్ని పుస్తకాల విడుదల కార్యక్రమాలు కూడా తన దుకాణంలో జరిగేవని అన్నాడు. ఎక్కువ మంది కస్టమర్లు ఒకే రకం పుస్తకాన్ని ఎక్కువగా అడిగేవారని, కొన్ని సందర్భాలలో ఒకే రకం పుస్తకాలకు మంచి డిమాండ్ ఉంటుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బుక్ స్టాల్ ను ఏర్పాటు చేశానని.. ఇప్పటివరకు సుమారు రెండువేల రకాల పుస్తకాలను అమ్మినట్లు యోషియుకి మొరియొకా వివరించాడు.