: మహిళా కళాశాలలో ఇద్దరు పురుషులు... మూడేళ్ల తరువాత కనుగొన్న బెంగళూరు వర్శిటీ
కన్నడనాట ఓ మహిళా కళాశాలలో ఇద్దరు పురుషులు పీహెచ్డీ చేసేందుకు ప్రవేశం పొందారు. వారి రీసెర్చ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో విషయం వెలుగులోకి రాగా, వీరి విషయంలో ఏం చేయాలని బెంగళూరు యూనివర్శిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరు వర్శిటీకి అనుబంధంగా ఉన్న మహరాణీస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లోని వీహెచ్డీ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమ్ సైన్స్ విభాగంలో 2012లో పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షలు జరిగిన సమయంలో ఓ పురుష అభ్యర్థికి ప్రవేశం లభించింది. ఆపై 2013లోనూ ఇలాగే జరిగింది. మహిళా కళాశాల అధికారులు సైతం విషయాన్ని వర్శిటీ అధికారులకు చేరవేయలేదు. వారు కాలేజీకి ఎలా వచ్చి వెళ్తున్నారన్న విషయంపైనా సమాచారం లేదు. విషయం వెలుగులోకి వచ్చిన తరువాత వర్శిటీలో అత్యున్నత నిర్ణాయక మండలి 'సిండికేట్' సమావేశమైంది. వీరిని ఏం చేయాలన్న విషయమై చర్చించింది. అందుబాటులోని రికార్డుల ప్రకారం, వీరిద్దరూ అధికారికంగానే ప్రవేశం పొందారని తెలుస్తుండటంతో ఎవరిని బాధ్యులుగా చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక ఓ మహిళా కళాశాలలో ప్రవేశానికి ఎలా అనుమతిస్తారని బెంగళూరు వర్శిటీ అధికారులకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వర్శిటీ ప్రవేశాన్ని ఖరారు చేశాక మేమేం చేస్తామని మహిళా కళాశాల వాదిస్తోంది. మొత్తం ఉదంతం తమ తప్పు లేకుండానే ఇది జరిగిపోయిందని విద్యార్థులు వాదిస్తున్నారు. తమ కోర్సులను పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్టు ఉమెన్స్ కాలేజీలో మూడేళ్లుగా పీహెచ్డీ చేస్తున్న సీఎస్ శివకుమార్ అంటున్నాడు. జనవరిలో జరిగే తదుపరి సిండికేట్ సమావేశంలో వీరిపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.