: ఇక అమెరికా వెళ్లాలంటే వీసా ఒక్కటే చాలదు!


వీసా వచ్చేసింది కదా అని సంబరపడిపోతూ, ఆపై ఓ విమానంలో టికెట్ కొనుక్కుని అమెరికాకు వెళ్లిపోవచ్చనుకుంటే ఇకపై కుదరదు. వీసా తీసుకున్నాక కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్టులోనో లేదా అమెరికాలో దిగగానే అక్కడి నుంచో వెనక్కు పంపేస్తున్న ఘటనలు ఎక్కువైపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. యూఎస్ వెళ్లాలన్న కోరికతో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే భారతీయులకు అమెరికా వీసాలిచ్చి, ఆపై వారిని దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చేయడంపై ఆ దేశమే బాధ్యత వహించాలని ఇండియా డిమాండ్ చేస్తుండగా, అది విద్యార్థుల సమస్యని, వారి వాలకం సరిగ్గా లేదని, వీసాకు, వర్శిటీలకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి బార్డర్ పెట్రోల్ ఏజంట్లకు ఇచ్చే వివరాలు అయోమయంగా ఉండటం, సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతోనే పలువురు డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎక్కడ విద్యను అభ్యసిస్తున్నారు? ఎక్కడ ఉంటారు? ఆరోగ్య బీమా, ఆర్థిక స్థితి వంటి విషయాలపై అంతంత మాత్రపు సమాధానాలు, అవగాహనా లేమితో అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమలడం వంటి కారణాలతో పలువురు విద్యార్థులు వెనక్కు వచ్చారు. ఉగ్రభయాలు పెరిగిన తరువాత, తమ దేశంలోకి వస్తున్న వారి విషయమై అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక అన్ని డాక్యుమెంట్లతో పాటు అమెరికా వెళ్లే వారికి పూర్తి ఆంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి. ఇండియాలోని ఎయిర్ పోర్టులో అయినా, అమెరికాలో దిగిన తరువాతైనా అధికారులను సంతృప్తి పరచగలిగితేనే యూఎస్ కల నెరవేరుతుంది.

  • Loading...

More Telugu News