: ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ పై ఐఐటీ, ఐఐఎస్పీ ఫ్రొఫెసర్ల నిరసన గళం... అనుమతి ఇవ్వొద్దంటూ ట్రాయ్ కి విన్నపం
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ ప్రతిపాదించిన ఫ్రీ బేసిక్స్ పై భారత్ లో నిరసన గళాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న సంస్థలకు చెందిన నిపుణులు ఫ్రీ బేసిక్స్ వల్ల కలిగే నష్టాలపై గొంతెత్తితే, తాజాగా దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాలయాలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లకు చెందిన అధ్యాపకులు నిరసన గళం విప్పారు. ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్ బుక్ మొత్తం నెట్ వినియోగదారులనే తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు. బాంబే, ఖరగ్ పూర్, మద్రాస్, పాట్నా ఐఐటీలతో పాటు ఐఐఎస్సీకి చెందిన ఫ్రొఫెసర్లు 50 మంది దాకా కలసి కోల్ కతాలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ జనాన్ని నయవంచనకు గురి చేసేందుకు యత్నిస్తోందని కూడా వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కూడా వారు ట్రాయ్ ని కోరారు.