: సిసలైన బీజేపీ నేతగా నిరూపించుకున్న మనోహర్ లాల్ ఖట్టర్: కాంగ్రెస్ నేతలు
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అసలు సిసలు బీజేపీ నేతగా నిరూపించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గత జూలైలో మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర రవాణా బస్సులో ప్రయాణించి, తాను నిరాడంబర జీవితాన్ని కోరుకుంటానని, అంతా తనలా ఉండాలని ఆకాంక్షిస్తానని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆయన ప్రకటనకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని, ఆయన వ్యక్తిత్వం వెలకట్టలేనిదని వేనోళ్ల పొగిడారు. అయితే ఆయన తాజాగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి, నాలుగు టయోటా ఫార్చ్యూనర్ కార్లను, నాలుగు హోండా సీవీఆర్ కార్లను కొనుగోలు చేశారు. తన నిర్ణయంపై వ్యతిరేకత రాకుండా మంత్రులందరికీ ఫార్చ్యూనర్ కార్లను కొంటానని, అధికారులకు హోండా సీవీఆర్ కార్లను కొంటానని ప్రకటించారు. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నిరాడంబర జీవితంపై లెక్చర్లు ఇచ్చిన ఖట్టర్ అసలు రంగు బయటపడిందని పేర్కొంటున్నారు. నీతులు చెప్పడానికే కానీ ఆచరించడం బీజేపీ నేతలకు చేతకాదని వారు విమర్శల దాడి చేస్తున్నారు.