: బొకోహరాం చెరవీడని బాలికలు.. అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ తల్లిదండ్రుల ఆవేదన!
నైజీరియాలోని బాలికలు బొకోహరం ఉగ్రవాదులకు బందీలై సుమారు రెండేళ్లు కావస్తోంది. 2014 ఏప్రిల్ 14వ తేదీన నైజీరియాలోని చిబుక్ ప్రాంతం నుంచి సుమారు 250 మంది బాలికలను వారు అపహరించుకుపోయారు. వారిలో కొంతమంది తప్పించుకోగా, మరికొంతమంది ఆచూకీ తెలియడం లేదు. పాఠశాలకు వెళ్లొస్తామని చెప్పిన వారు ఈ కిడ్నాప్ నకు గురయ్యారు. బాలికల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు విఫలయత్నాలు ఎన్నో చేశారు. బాలికలను కిడ్నాప్ చేసి ఈరోజుకు 624 రోజులు అయింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న బాలికలను విడిపించేందుకు నైజీరియా కొత్త అధ్యక్షుడు బుకారీ ఇంతవరకూ ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టలేదు. బాలికలు తిరిగొస్తారనే ఆశతో కొంతమంది తల్లిదండ్రులుండగా, మరికొంత మంది ఇప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా (కెన్)కు చెందిన రెవరెండ్ టిటుస్ పొన్నా మాట్లాడుతూ, కిడ్నాప్ నకు గురైన బాలికల తల్లిదండ్రులు చాలా మంది వారి పిల్లలు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వెనక్కి తిరిగి వస్తారన్న నమ్మకం వారికి ఏకోశాన లేదని... వారి పిల్లలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారని పొన్నా పేర్కొన్నారు. బాధిత బాలికల తల్లిదండ్రులు 17 మంది వరకు చనిపోయి ఉంటారని, మరికొంత మంది తల్లిదండ్రులు తీవ్ర వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. కిడ్నాప్ అయిన బాలికల కోసం, చెప్పలేనంత ఆవేదనను అనుభవిస్తున్న వారి తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్థించడం మినహా చేయగలిగిందేమీ లేదు.. ఆ దేవుడే వారిని రక్షించాలంటూ ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు.