: బాలయ్య డీసెంట్ జెంటిల్మన్: ఎమ్మెల్యే రోజా కితాబు
ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డీసెంట్ జెంటిల్మన్ అని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కితాబిచ్చారు. తన దృష్టిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన కుటుంబం మంచి చెడ్డల గురించి బాలకృష్ణ తరచుగా అడుగుతుంటారని రోజా పేర్కొంది. బాలకృష్ణ అంటే తనకెంతో గౌరవమే కాకుండా బాగా అభిమానిస్తానని అన్నారు. బాలకృష్ణ తనను ఆదరించిన విధంగా ఏ ఇతర హీరోయిన్ ని ఆదరించలేదని రోజా పేర్కొంది. కాగా, బాలకృష్ణ సరసన రోజా నటించిన చిత్రం భైరవద్వీపం సూపర్ డూపర్ హిట్. పలు చిత్రాల ద్వారా వీరి జంట ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వాళ్లద్దరూ రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరిగిన రసాభాస అంతా ఇంతా కాదు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మాటల యుద్ధంతో సమావేశాలు సవ్యంగా సాగిన పాపాన పోలేదు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రోజా మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ఏడాది పాటు పాల్గొనకుండా ఆమెపై వేటు వేసిన విషయం తెలిసిందే.