: 'టీ' అమ్ముకునే తండ్రిని గర్వంగా తలెత్తుకునేలా చేసిన కుమార్తె...సక్సెస్ స్టోరీ
అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి దూసుకెళ్లి, తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకుని జీవించేలా కొంత మంది విజయం సాధిస్తారు. పంజాబ్ లోని జలంధర్ జిల్లాలోని నకోదర్ సబ్ డివిజినల్ కోర్టు ప్రాంగణంలో సురీందర్ కుమార్ టీ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడ వ్యాజ్యాల పరిష్కారానికి వచ్చే కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు సురేందర్ కుమార్ టీ సరఫరా చేస్తుంటారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కావడంతో వారికి సరసమైన ధరకే టీ సరఫరా చేయకతప్పని పరిస్థితి ఆయనది. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ, కుమార్తెను చదివించారు. కళాశాల విద్య పూర్తి చేసిన సురేందర్ కుమార్ కుమార్తె శృతి పంజాబ్ యూనివర్సిటీలో లాను పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే పంజాబ్ సివిల్ సర్వీసెస్ (జ్యుడీషియల్ విభాగం) లో విజయం సాధించింది. ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న శృతి, తన తండ్రి ఏ కోర్టులో అయితే టీ అమ్ముతూ తనను చదివించారో అదే న్యాయస్థానంలో జడ్జిగా నియమితురాలైంది. దీంతో ఇంతవరకు టీ అమ్మే వ్యక్తిగా గుర్తింపు పొందిన సురేందర్ కుమార్, ఇప్పుడు జడ్జి శృతి తండ్రిగా గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. దీంతో ఆయన తన కుమార్తె సాధించిన ఘనత పట్ల గర్వంగా ఫీలవుతున్నారు.