: ఇంకిపోతున్న నీరు... వెనిస్ నగరం శోభ ఇక గత వైభవమేనా?
వీధుల్లో నీటి పాయలతో అలరారే వెనిస్ నగరాన్ని పడవ ప్రయాణం ద్వారా చుట్టేయొచ్చు. ఈ ప్రత్యేకతే దీనిని అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. తెలుగు సినిమాల్లో ఎన్నో సార్లు సందడి చేసిన వెనిస్ నగరం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. ఇక్కడ వీధుల్లో సందడి చేసిన నీటిపాయలు ఇంకిపోతున్నాయనే భయం కలుగుతోంది. వీధుల్లో నీటి పాయల్లో నీటి మట్టం పడిపోయింది. కొన్ని చోట్ల కాలువల్లో నీటిమట్టం 70 సెంటీ మీటర్ల దిగువకు వచ్చేసింది. శీతాకాలంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే... ఇక ఎండాకాలంలో కాల్వలు ఎండిపోక తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులు, అధికపీడనాలు, తక్కువ వర్షపాతం నమోదు కావడం అని నిపుణులు అంటున్నారు. వీటి వల్ల నీరు ఇంకిపోతోందని వారు పేర్కొంటున్నారు. ఇదిలాగే కొనసాగితే వెనిస్ నగరం గతవైభవాన్ని కోల్పోతుందని ఆందోళన చెందుతున్నారు.