: యూరప్ ప్రభావంతో మన మార్కెట్ల లాభాలు మటుమాయం!


యూరప్ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించి వేయడంతో భారత మార్కెట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం వరకూ క్రితం ముగింపునకు అటూఇటుగా కదలాడిన సూచికలు మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ఒత్తిడిలోకి జారిపోయాయి. ఒకదశలో 26,100 పాయింట్ల కన్నా అధికంగా ఉన్న సెన్సెక్స్, 150 పాయింట్లకు పైగా దిగజారింది. దీంతో సెన్సెక్స్ మరోసారి 26 వేల పాయింట్ల కన్నా కిందకు పడిపోయింది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 119.45 పాయింట్లు పడిపోయి 0.46 శాతం నష్టంతో 25,960.03 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 32.70 పాయింట్లు తగ్గి 0.41 శాతం నష్టంతో 7,896.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.21 శాతం, స్మాల్ క్యాప్ 0.07 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 21 కంపెనీలు లాభాల్లో నడిచాయి. జడ్ఈఈఎల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 99,80,888 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,951 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,385 కంపెనీలు లాభాలను, 1,283 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

  • Loading...

More Telugu News