: జీహెచ్ఎంసీ ఎన్నికలపై 'ఎమ్మెల్సీ' ఫలితాల ప్రభావం ఉంటుంది: ఉత్తమ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు రావొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఈ ఎమ్మెల్సీ ఫలితాల ప్రభావం ఉంటుందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్నామని చెప్పారు. డివిజన్ కమిటీల అభిప్రాయం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో పార్టీ నేతలు మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ లతో ఉత్తమ్ భేటీ అయ్యారు. ఇటీవల ఉప్పల్ లో దానం, మల్లేశ్, వారి వర్గీయుల మధ్య జెండా ఎగురవేసిన విషయంలో జరిగిన వివాదంపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే 64 డివిజన్లను ఆ జిల్లా నేతలకు, హైదరాబాద్ పరిధిలోకి వచ్చే 76 డివిజన్లను దానంకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సమష్టిగా పోరాడితే కాంగ్రెస్ దే విజయమని తెలిపారు.