: కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్!... ఆడియో టేపులను బయటపెట్టిన ఆంగ్ల పత్రిక
కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమంటోంది. ప్రతి విషయంపైనా ఈ రెండు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో విమర్శలు ఘాటెక్కుతున్నాయి. నిత్యం ఈ రెండు పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది. ఏ అంశంపైనా ఇరు పార్టీలకు ఏకాభిప్రాయం లేదు. ప్రజల సంక్షేమాన్ని పణంగా పెట్టి అయినా ఆ పార్టీలు వాదులాటకే సై అంటున్నాయి తప్పించి, మంచి చేద్దామన్న నిర్ణయంపై ఏకతాటిపైకి వచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇరు పార్టీల మధ్య మిలాఖత్ ఏమిటనేగా మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, నేరుగా చత్తీస్ గఢ్ వెళ్లాల్సిందే. బీజేపీ పాలిత ఆ రాష్ట్రంలో సీఎంగా బీజేపీ నేత రమణ్ సింగ్ ఉన్నారు. రాష్ట్రంలోని అంతాగఢ్ అసెంబ్లీకి ఏడాది క్రితం (2014లో) జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంతూరామ్ పవార్ చివరి నిమిషంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి భోజ్ రాజ్ నాగ్ సునాయసంగా గెలిచిపోయారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై పెద్ద చర్చే నడించింది. దీనికి సంబంధించి తాజాగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నేటి తన సంచికలో ఓ కథనాన్ని రాసింది. లోపాయికారి ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి చేత నామినేషన్ ఉపసంహరించుకోగా, బీజేపీ అభ్యర్థి గెలిచిపోయారని సదరు ఆంగ్ల పత్రిక సాక్ష్యాలతో సహా కథనం రాసేసింది. రమణ్ సింగ్ అల్లుడు పునీత్ గుప్తా... ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంతూరామ్ పవార్ లతో మాట్లాడినట్లుగా భావిస్తున్న టెలిఫోన్ సంభాషణలను ఆ కథనం ప్రస్తావించింది. ఈ కథనంపై అజిత్ జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక రమణ్ సింగ్ నామినేషన్ ఉపసంహరణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని చెప్పి అసలు విషయాన్ని దాటవేశారు.