: మోదీ, బాబు, పవన్... నాడొక మాట, నేడొక మాట!
నరేంద్ర మోదీ, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్... ఒకరు కేంద్రంలో, మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పుతుండగా, ఇంకొకరు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని ప్రభావితం చేయదగ్గ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈ ముగ్గరూ ప్రత్యేక హోదా విషయంలో నాడొక మాట చెప్పి ఆపై మాటలు మార్చారు. కాలగతిలో మరో సంవత్సరం ముగిసిపోయిన వేళ వీరి మాటలు ఎలా మారాయంటే... నరేంద్ర మోదీ: ఎన్నికలకు ముందు తిరుపతిలో: సీమాంధ్ర ప్రజలు ప్రత్యేక హోదాను సాధించుకోనున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లనుంది. దానికి నాది హామీ. మా ప్రభుత్వం వస్తే వెంటనే రాష్ట్రానికి హోదా లభిస్తుంది. దీనికి కారణమైన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు. అమరావతి శంకుస్థాపన సభలో: పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి మావంతు సహకారాన్ని అందిస్తామని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబునాయుడు: ఏపీ అసెంబ్లీలో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే. ఇందులో సందేహమే లేదు. మేము కూడా ఒత్తిడి తెస్తున్నాం. విపక్షాలు కూడా సహకరించాలి. ఢిల్లీలో మోదీతో భేటీ అనంతరం: ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది? రెండు వస్తాయి. ఒకటి ఈఏపీ. రెండు సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ. హోదా కన్నా అధిక ప్యాకేజీ ఇస్తామంటున్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా? పవన్ కల్యాణ్: నాడు మీడియా సమావేశంలో: తెలంగాణ ఎంపీలు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సీమాంధ్ర ఎంపీలు చేయలేకపోయారు. కారణం వారి వ్యాపారాలే. వ్యాపార కోణంలో ఢిల్లీ వెళ్లే వీరు మేడమ్... మేడమ్ అంటూ చేతులు కట్టుకుని మెమ్మెమ్మె, బెబ్బెబ్బె అంటూ వెనక్కు వచ్చేస్తున్నారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టుగా, తిడితే కేసీఆర్ లా తిట్టాలి, పడితే సిగ్గులేని సీమాంధ్ర ఎంపీలు మాదిరి పడాలి. సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం, ఆత్మగౌరవం లేదా? అన్న సందేహం కలుగుతోంది. హోదాపై ఒక్కరూ పోరాటం చేయడం లేదు. బాధ్యత తీసుకోవడం లేదు. అమరావతిలో చంద్రబాబుతో సమావేశం తరువాత: బాధ్యత తీసుకోవడానికి నేనేమైనా ముఖ్యమంత్రి కన్నా పెద్ద వాడినా? కనీసం ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు. టైమౌట్ పెట్టడానికి నాకంత స్థాయి లేదు. ఇక కాదంటే రోడ్లపైకి రావాలి. దానివల్ల మనకే నష్టం. దానివల్ల కేంద్రం కూడా స్పందించదు. ఏదైనా సిస్టమ్ ద్వారానే వెళ్లాలి. ఇలా మారాయి మన నేతల అవకాశవాద మాటలు.