: 'ఉచిత ఇంటర్నెట్' వివాదాన్ని మరింత పెంచిన మార్క్ జుకర్ బర్గ్!
ఉచిత ఇంటర్నెట్... ఇండియాలో పేదలకు నెట్ సేవలను మరింత దగ్గర చేసేందుకు కొన్ని ఎంపిక చేసిన వెబ్ సైట్లను ఉచితంగా అందించాలని వచ్చిన ప్రతిపాదన. దీనివల్ల తమ ఆదాయాలు కోల్పోతామని అటు టెలికంలు, టెల్కోలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి డబ్బు చెల్లించే వెబ్ సైట్లే వేగంగా ఓపెన్ అవుతాయని, మిగతా సంస్థలకు నష్టం వాటిల్లుతుందని చర్చ జరుగుతున్న సమయంలో ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ అగ్నికి ఆజ్యం పోసినంత పని చేశారు. ప్రధాన దినపత్రికల్లో ఉచిత ఇంటర్నెట్ అంటూ ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడంతో పాటు, ఇప్పుడు 'ఉచితం'కు మరింత మద్దతు పలుకుతూ వీడియో ప్రచారాలనూ వదిలారు. "ఇండియాలో డిజిటల్ సమానత్వానికి ఉచిత ఇంటర్నెట్ సహకరిస్తుంది" అంటూ ఆయన చేస్తున్న ప్రచారం నెట్ న్యూట్రాలిటీ వివాదాన్ని మరో మెట్టు ఎక్కించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్, రిలయన్స్ మధ్య ఉచిత ఇంటర్నెట్ దిశగా డీల్ కుదరగా, దాన్ని కోర్టులు తాత్కాలికంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఉచిత ఇంటర్నెట్ వస్తే, మొత్తం నెట్ ప్రపంచమే రెండుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, జుకర్ బర్గ్ వ్యాపార ప్రకటన ప్రచురితమైన ఓ దినపత్రికలో 'సేవ్ ది ఇంటర్నెట్ డాట్ ఇన్' పేరిట వెబ్ సైట్ నిర్వహిస్తున్న నిఖిల్ పాహ్వా ఓ ప్రత్యేక కాలమ్ లో హెచ్చరించారు. ఇక తాజాగా ఫేస్ బుక్ లో లాగిన్ అయిన కస్టమర్లకు "ఫ్రీ బేసిక్స్ కు మద్దతుగా స్పందించండి. టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియాకు 'మేము ఉచిత ఇంటర్నెట్ కు అనుకూలం' అంటూ మెసేజ్ పంపండి" అన్న డైలాగ్ బాక్స్ దర్శనమిస్తోంది. దీనిపై ట్రాయ్ కూడా స్పందించింది. ఈ విషయంలో ప్రజల స్పందన తెలుసుకుంటున్నామని, 'సేవ్ ది ఇంటర్నెట్ డాట్ ఇన్'లో రిజిస్టర్ అయి నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు తెలపవచ్చని స్పష్టం చేసింది. ఫ్రీ బేసిక్స్ అంటే ఏ విధమైన డేటా చార్జీలు లేకుండా సమాచారం, వైద్య, విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి ఎంపిక చేసిన అంశాలను నెట్ లో ఉచితంగా చూడటం. నెట్ న్యూట్రాలిటీ అంటే, ఇంటర్నెట్ సేవలందిస్తున్న కంపెనీలన్నీ ఒకటే అన్న భావన. ఇక పెద్ద పెద్ద సామాజిక మాధ్యమాలను ఉచితం చేస్తే, ఈ రంగంలో ఉపాధిని పొందుతున్న వేలాది వెబ్ సైట్లు మూతపడక తప్పనిసరి పరిస్థితి నెలకొంటుందని, వందలాది ఔత్సాహికులకు ఉపాధి దూరమవుతుందని నిపుణుల అంచనా. అదే ఇప్పుడు పెను సమస్యగా మారింది. ఇక ఫేస్ బుక్ వంటి నెట్ దిగ్గజం స్వయంగా రంగంలో ఉండటం, గూగుల్, ట్విట్టర్ లు సైతం తమ వ్యాపార లబ్ధి కోసం ఉచిత ఇంటర్నెట్ బాటలో నడిచేలా కనిపిస్తుండటంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.