: స్మృతీ ఇరానీపై విరుచుకుపడ్డ తరుణ్ గగోయ్
అసోంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, హత్యల సంఖ్య పెరిగిపోయిందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే, అసోంలో మహిళలు మరింత భద్రంగా ఉన్నారని ఆయన అన్నారు. 2014లో అసోంలో 19,139 వేధింపుల కేసులు నమోదయ్యాయని గుర్తు చేసిన ఆయన, అదే సమయంలో మధ్యప్రదేశ్ లో 28,678 కేసులు, మహారాష్ట్రలో 26,690 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా, గత పదేళ్లలో అసోంలో 75 వేల మంది మహిళలు పోలీసు స్టేషన్లను ఆశ్రయించారని అక్కడ వారికి భద్రత లేదని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ గగోయ్, పాత గణాంకాలను మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం అసోంలో 1,036 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని, అదే సమయంలో మధ్యప్రదేశ్ లో 3,678 మంది, మహారాష్ట్రలో 4,474 మంది, గుజరాత్ లో 2,672 మంది బలవంతంగా తనువు చాలించారని, ఈ గణాంకాలు చూస్తే ఎక్కడ మహిళలకు భద్రత అధికమో తేటతెల్లమవుతుందని అన్నారు.