: కేంద్రం ఎన్ని అడ్డంకులు కలిగించినా... డీడీసీఏపై విచారణ ఆగదు: తేల్చిచెప్పిన కేజ్రీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు మధ్య మళ్లీ చిచ్చు రాజుకునేలానే ఉంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యక్ష ప్రమేయముందని భావిస్తున్న ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అవకతవకలపై కేజ్రీ సర్కారు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ ను కమిషన్ చైర్మన్ గా నియమించిన ఢిల్లీ సర్కారు, ఆయన దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరించాల్సిందేనని అధికార వర్గాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విచారణలో భాగంగా వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు తనకు ఓ ప్రత్యక దర్యాప్తు బృందం కావాలని పేర్కొన్న సుబ్రహ్మణియన్... సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ శాఖలకు ఐదుగురు చొప్పున అధికారులను కేటాయించాలని ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు లేఖ కూడా రాశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్, విచారణలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. ఈ విషయంలో కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విచారణ ముందుకే సాగుతుందని ఆయన ప్రకటించారు.