: ‘దేశీ నెయ్యి’లో ఫంగస్!... మళ్లీ చిక్కుల్లో పడ్డ రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చిక్కులు తప్పేలా లేవు. పతంజలి బ్రాండు పేరిట ఆయన సంస్థ ఉత్పత్తి చేస్తున్న నూడుల్స్ కు ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేవన్న వార్తలు ఇటీవల ఆయనను చిక్కుల్లో పడేశాయి. ఆ చిక్కుల్లో నుంచి బయట పడకముందే పతంజలి సంస్థ ఉత్పత్తులపై తమిళ ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. గోమూత్రం ఉన్న సదరు ఉత్పత్తులను వాడరాదని ఆ సంఘాలు తమ వర్గానికి చెందిన ప్రజలకు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా పతంజలి సంస్థకు చెందిన మరో ఉత్పత్తి ‘దేశీ నెయ్యి’లో ఫంగస్ వెలుగుచూసింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వెనువెంటనే రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు నెయ్యి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబోరేటరీకి పంపారు. 15 రోజుల్లోగా ఈ పరీక్షలకు సంబందించిన నివేదికలు అందనున్నాయి.