: హోమాలతో ఫలితం ఉంటుందా?... కేసీఆర్ యాగంపై కర్ణాటక సీఎం కామెంట్


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయుత మహా చండీయాగం పేరిట భారీ యాగాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రుత్విక్కులను పిలిపించిన ఆయన ఐదు రోజుల పాటు మెదక్ జిల్లాలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ యాగంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. విధాన సౌధలో జరిగిన కవి కువెంపు జయంతి వేడుకల సందర్భంగా సిద్ధరామయ్య చండీయాగాన్ని ప్రస్తావించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం చేశారు. హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా?’’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘‘యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అదే నిజమైతే దేశంలో కరవు ఛాయలే కనిపించేవి కావు. యావత్తు దేశాన్నే సుభిక్షం చేసేవాళ్లం’’ అని కూడా ఆయన అన్నారు. అయినా విద్యావంతులు కూడా కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News