: ఐఎస్ లో చేరిన భారతీయులు 23 మంది... వారిలో మనోళ్ల సంఖ్యే ఎక్కువ!
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల్లో ఇప్పటిదాకా 23 మంది భారతీయులు చేరిపోయారట. వివిధ మార్గాల ద్వారా సరిహద్దులు దాటిన దేశీయ యువత ఐఎస్ లో చేరిపోతోందట. ఇలా వెళుతున్న క్రమంలో చాలా సందర్భాలలో యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాదుకు చెందిన ఆరుగురిని పోలీసులు పట్టేశారు. నిన్న జాతీయ చానెళ్లలో ఈ తంతుపై ఓ కథనం ప్రసారమైంది. ఈ కథనం ప్రకారం ఐఎస్ లో చేరిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎస్ లో చేరిపోయిన 23 మంది యువకుల్లో 17 మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యువకులే ఉన్నారట. ఇక రాష్ట్రాల వారీగా లెక్కిస్తే... తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ నుంచి తరలిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఐఎస్ లో చేరిన 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులే నలుగురు ఉన్నారు. కేరళ, మహారాష్ట్రల నుంచి కూడా నలుగురేసి చొప్పున యువకులు ఐఎస్ లో చేరారు. ఇక తమిళనాడుకు చెందిన యువకులు కూడా ముగ్గురు ఉన్నారట. జమ్ము కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లకు చెందిన ఒక్కో యువకుడు ఐఎస్ లో చేరిపోయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఎస్ ఉగ్రవాదులను జెబా ఫర్హాన్ (హైదరాబాదు), తల్మిజుర్ రహమాన్ (గుంటూరు), అతిఫ్ అహ్మద్ ఖాన్ (హైదరాబాదు), అథిఫ్ వసీం మొహమ్మద్ (ఆదిలాబాదు)లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.