: కోడి పందేలను అరికట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలకు ఉన్న ఆదరణకు అంతులేదు. సంక్రాంతి వేడుకల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారేది పందేలు జరిగే ప్రదేశాలలోనే! అయితే, ఇటీవలి కాలంలో పోలీసుల రైడింగులు ఎక్కువగా ఉంటుండడంతో పల్లెటూర్లలో రాజకీయనేతలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో, ఈ ఏడాది ఎలాగైనా కోడి పందేలకు అనుమతులు తీసుకొస్తామంటూ పలువురు నేతలు స్థానికులకు హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో కోడి పందేల నిర్వహణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేంది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కోడి పందేలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ రోజు ప్రశ్నించింది. ఆ ఆదేశాలను తమకు నివేదించాలని హైకోర్టు అధికారులకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో కోడి పందేలకు అనుమతులు తీసుకొస్తామన్న నేతలకు నిరాశే మిగిలింది.