: హైదరాబాదుకు తక్షణం కావాల్సినవి తాగు నీరు, రవాణా వసతి
హైదరాబాదుకు తక్షణం మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన బ్రాండ్ హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాదులో గత 50 ఏళ్ల పాలనలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేయలేదని అన్నారు. అందువల్లే నేడు హైదరాబాదు పలు సమస్యలతో సతమతమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించలేకపోయామని అన్నారు. అలాగే విశాలమైన రోడ్లను నిర్మించుకోలేకపోయామని, పాదచారులకు సరైన సౌకర్యాలు కల్పించుకోలేకపోయామని అన్నారు. హైటెక్ సిటీ ఉన్నప్పటికీ హైటెక్ వ్యవస్థ లేకపోయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. మూసీ నదిపై సువిశాలమైన బ్రిడ్జ్ రోడ్డును నిర్మించి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని అన్నారు. ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందజేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదును తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్ధాయి నగరంగా తీర్చిదిద్దుతుందని ఆయన తెలిపారు.