: వయస్సుతో పాటు పెరుగుతున్న తల .. బిడ్డ రూపం చూసి వదిలేసిన తల్లి!
తల్లి గర్భంలో ఉండగానే ఆ బిడ్డ తండ్రిని పోగొట్టుకున్నాడు...పుట్టాక తన రూపాన్ని చూసి ఆ తల్లీ వదిలేసింది.. మోయలేని తల బరువుతో ఉన్న ఆ బిడ్డ భారాన్ని ఇప్పుడు నాయనమ్మ మోస్తోంది. ఆ బిడ్డకు వైద్యం చేయించేందుకు ఆమె ఎంతో ప్రయాసపడుతోంది. శస్త్ర చికిత్స చేస్తే బాలుడికి నయమవు తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఆర్థిక స్తోమత లేని కారణంగా ఆ బిడ్డకు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒక టీవీ ఛానల్ లో ప్రసారమైన ఈ సంఘటన వివరాలు.. కడప శివారులోని వడ్డేపల్లికి చెందిన ఈ చిన్నారి పేరు వెంకట మధు. పుట్టుకతోనే పెద్ద తలకాయతో పుట్టాడు. వయస్సుతో పాటు బాలుడి తల బరువు కూడా పెరుగుతోంది. వెంకటమధు తల్లి గర్భంలో ఉండగానే తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మధు ఆకారం చూడలేని కన్నతల్లి అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. తల్లిదండ్రులిద్దరూ దూరమవడంతో బాలుడి ఆలనా పాలనను నాయనమ్మ రమణమ్మ చూస్తోంది. పనికి వెళితేనే రోజు గడిచే స్థితి రమణమ్మది. అయినప్పటికీ, మధుకు వైద్యం చేయించింది. ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లింది. శస్త్ర చికిత్స చేస్తే మధుకు నయమవుతుందని వైద్యులు చెప్పారు. అయితే, శస్త్రచికిత్స చేయించే స్తోమత ఆమెకు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ, ‘మోయలేని తలభారంతో ఉన్న నా మనవడు మధుకి ఒక చెయ్యి కూడా పనిచేయదు. కంటి చూపు సరిగ్గా లేదు. వాడికి చదువంటే మహా ప్రాణం. పాఠశాలకు వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా వాడిని ఎత్తుకుని తీసుకెళుతుంటాను. వయస్సు మీదపడటంతో వాడిని మోయలేకపోతున్నాను. శస్త్రచికిత్స చేయిద్దామంటే నా దగ్గర అంత డబ్బు లేదు. ఎవరైనా మహానుభావులు స్పందించి.. నా మనవడికి శస్త్రచికిత్స చేయించి పుణ్యం కట్టుకోవాలి’ అని రమణమ్మ వేడుకుంది.