: 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పాక్ ప్రధాని నివాసం!


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యక్తిగత నివాసం గురించిన విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యంలో మునిగి తేలాల్సిందే. నవాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వ్యక్తిగత నివాసంలో ఇటీవల సందడి చేశారు. రాజసౌధాన్ని తలపించేలా ఉన్న ఆయన నివాసం మోదీని సైతం ఆశ్చర్యపరిచిందనడంలో అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ఇంటి గురించిన కొన్ని విశేషాలు మీకోసం... పాకిస్థాన్ లోని లాహోర్ సమీపంలోని షరీఫ్ అగ్రీ ఫార్మ్స్ తరపున నిర్మించుకున్న రాజసౌధమే నవాజ్ షరీఫ్ నివాసం. దీని పేరు 'జతీఉమ్రా రైవింద్ ప్యాలెస్' ఈ పేరులోని తొలి నాలుగు అక్షరాలు నవాజ్ షరీఫ్ పూర్వీకుల స్వగ్రామం పేరు. ఇది భారత్ లోని పంజాబ్ లోని అమృత్ సర్ దగ్గర్లో ఉన్న జతీఉమ్రా గ్రామం. ఈ గ్రామంలోనే నవాజ్ షరీఫ్ పూర్వీకులు ఉండేవారు. దేశ విభజన సమయంలో నవాజ్ షరీఫ్ తండ్రి మియా మెహమ్మద్ షరీఫ్ సాహిబ్ పాకిస్థాన్ లోని లాహోర్ లో వ్యాపారిగా స్థిరపడ్డారు. 1939లో లాహోర్ లో 'ఇత్తేఫాక్' పేరుతో ఇనుము ఉక్కు సంబంధిత వాణిజ్య కార్యకలాపాలు సాగించారు. తరువాతి కాలంలో దానితో పాటు చక్కెర, టెక్స్ టైల్, కాగితం తదితర వాణిజ్య రంగాల్లో ఆయన సత్తాచాటారు. మధ్యలో ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని ఒడిదుడుకులకు లోనైనా తరువాత పుంజుకుని దేశాన్ని శాసించే స్థాయికి ఆయన కుటుంబం చేరుకుంది. తన పూర్వీకులు నివసించిన గ్రామం పేరు మర్చిపోలేక ఆ పేరును తమ నివాస స్థలానికి పెట్టుకున్నారు. ఇది మొత్తం 5 వేల ఎకరాల విస్తీర్ణంలో పచ్చని పొలాల మధ్య ఉండగా, 50 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. ఈ ప్రాంగణంలోనే నవాజ్ షరీఫ్ తండ్రి మియా మొహమ్మద్ షరీఫ్ సాహిబ్ సమాధి ఉంది. ఈ నివాసంలో నవాజ్ షరీఫ్, ఆయన భార్య కుల్సుం నవాజ్ షరీఫ్, వారి కుమారులు హసన్, హుస్సేన్, కుమార్తెలు మరియం, ఆస్మాలతో పాటు కోడళ్లు, అల్లుళ్లు, మనవలు, సోదరుడు, పంజాబ్ సీఎం షాబాజ్ ఆయన ముగ్గురు భార్యలు, వారి పిల్లలు, వారి మరో సోదరుడు అబ్బాస్ (మరణించారు) భార్య సబీహా తదితరులు మొత్తం 40 మంది ఆ ప్యాలెస్ లో నివాసం ఉంటున్నారు. వీరి రక్షణకు ఈ ఏడాది పాక్ ప్రభుత్వం 364 మిలియన్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని 4.4 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేసేందుకు, ఫెన్సింగ్ చుట్టుపక్కల 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, 100 ఎల్ఈడీ దీపాలతో పాటు అత్యంత భద్రతతో కూడిన 20 చెక్ పోస్టులు ఏర్పాటుకు వినియోగించనున్నారు. అలాగే వీరి నివాసం, వ్యక్తిగత భద్రత కోసం మొత్తం 2,751 మంది పోలీసులు, రక్షణ సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తం సిబ్బంది, ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం షాబాజ్ ల భద్రతను పర్యవేక్షిస్తుంటుంది. ఇంత భారీ ఏర్పాట్ల మధ్య పాకిస్థాన్ ప్రధాని నివాసం ఠీవీగా వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది.

  • Loading...

More Telugu News