: కొత్త సంవత్సరంలో కోరికేదైనా... రహస్యమే ప్రధానం!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ, 2016లో ఏదో చేయాలని, సాధించాలని అనుకుంటూ ఉండటం సహజం. అయితే దాన్ని ఇతరులతో పంచుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఓ కొత్త అధ్యయనం ప్రకారం, నూతన సంవత్సరంలో లక్ష్యాన్ని ఇతరులతో పంచుకోకుండా మనలోనే దాన్ని సాధిస్తానా? సాధించలేమా? అన్న ప్రశ్నతో ఉండిపోతే సులువుగా లక్ష్యానికి దగ్గరవుతామని తేలింది. ఇదే సమయంలో నేను దాన్ని సాధించగలనా? లేదా? అన్న ప్రశ్నను మాత్రం ఇతరులతో పంచుకోవాలని అధ్యయనం తెలుపుతోంది. దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఈ విషయంలో రీసెర్చ్ చేసిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ తమ అధ్యయనాన్ని పంచుకుంది. "భవిష్యత్తులో చేయాలనుకున్న పని లేదా చేరుకోవాల్సిన లక్ష్యాన్ని ప్రశ్న రూపంలో వదిలేస్తేనే మేలు" అని అధ్యయన రూపకర్త, కార్సన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ సీనియర్ అసోసియేట్ డీన్ డేవ్ స్పార్ట్ వెల్లడించారు. దీనివల్ల మానసికంగా పెద్దగా ఒత్తిడి కూడా ఉండదని, తద్వారా లక్ష్య సాధన సులువవుతుందని తెలిపారు.