: మరోసారి కోటి కోట్ల రూపాయలు దాటిన భారత మార్కెట్ కాప్
వచ్చే సంవత్సరంలో వస్తు సేవల బిల్లు ఆమోదం జరిగి తీరుతుందని, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను అమలు జరిగితీరుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలతో వరుసగా రెండవ రోజూ భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. దీనికితోడు ఆసియా మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచిందని, కొత్తగా ఈక్విటీల కొనుగోలుకు మద్దతు వచ్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు. దీంతో భారత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న కంపెనీల మార్కెట్ కాప్ కోటి కోట్ల రూపాయలను మరోసారి అధిగమించింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 45.35 పాయింట్లు పెరిగి 0.17 శాతం లాభంతో 26,079.48 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 3.80 పాయింట్లు పెరిగి 0.05 శాతం లాభంతో 7,928.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.42 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.13 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 24 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బజాజ్ ఆటో, అంబుజా సిమెంట్స్, గ్రాసిమ్, ఏసీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, హెచ్సీఎల్ టెక్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 1,00,01,254 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,911 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,180 కంపెనీలు లాభాలను, 1,472 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.