: పార్లమెంటు భవనం కూల్చి కొత్తగా నిర్మించాలనుకోవడం విడ్డూరం: శరద్ యాదవ్
ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా భవనం నిర్మించాలన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిపాదనపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ స్పందించారు. భవన నిర్మాణ ఆలోచనను వ్యతిరేకించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భవనం కూల్చి కొత్తది నిర్మించాలనుకోవడం విడ్డూరమన్నారు. ఇదొక చారిత్రాత్మక కట్టడమని, అటువంటి దానిని నాశనం చేయడం తగదని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి దుశ్చర్య లేదని పేర్కొన్నారు. ఈ రోజు పార్లమెంట్ భవనాన్ని కూల్చి... రేపు రాష్ట్రపతి భవనాన్ని కూల్చుతారా? అని యాదవ్ ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్ లోనే కొద్దిగా మార్పులు చేసి కొనసాగించవచ్చని చెప్పారు.