: మరో వందేళ్లయినా పార్లమెంటు భవనం చెక్కు చెదరదు!...స్పీకర్ వాదనను కొట్టేస్తున్న నిర్మాణ రంగ నిపుణుడు


88 ఏళ్ల క్రితం నిర్మితమైన పార్లమెంటు భవనానికి కాలం చెల్లిందన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లేఖపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా ఉన్న పార్లమెంటు భవనాన్ని కూల్చివేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జనతాదళ్ (యునైటెడ్) అధినేత శరద్ యాదవ్ నిన్ననే డిమాండ్ చేశారు. తాజాగా నిర్మాణ రంగంలో అపార అనుభవం గడించిన ప్రముఖ నిర్మాణ రంగ నిపుణుడు ఆర్టీ రవీంద్రన్ కూడా స్పీకర్ లేఖను తప్పుబట్టారు. ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ కు చైర్మన్ గానూ వ్యవహరించిన రవీంద్రన్ నేటి ఉదయం స్పీకర్ లేఖపై విస్మయం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులోని కొన్ని నిర్మాణాలకు జరిగిన మార్పులు చేర్పుల్లో రవీంద్రన్ పాలుపంచుకున్నారు. ఈ అనుభవాన్ని ప్రస్తావించిన ఆయన... మరో వందేళ్లైనా పార్లమెంటు భవనం చెక్కు చెదిరే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన ఈ భవనం అత్యంత పకడ్బందీ ప్రణాళికతో రూపొందిందన్నారు. సీటింగ్ కు సరిపోవట్లేదన్న వాదనను కూడా ఆయన కొట్టిపారేశారు. సీటింగ్ ఏరియాను పెంచుకునేందుకు స్వల్ప మార్పులు చేస్తే ఎలాంటి ప్రమాదం కూడా లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News