: కేరళలో మందు బాబులకు గడ్డు కాలమే... కొత్త మద్యం పాలసీకే ఓటేసిన సుప్రీం


కేరళలో మందు బాబులకు ఇక గడ్డు కాలమే. ఎందుకంటే, మద్యం సేవించాలనుకునే వారు సర్కారీ వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేయాలి. నేరుగా ఇంటికి తీసుకెళ్లి తాగాలి. ఇంటిలో తల్లిదండ్రులు, భార్యా బిడ్డల పోరున్న వారు, బయటే బార్లలో తాగుతామంటే ఇకపై కుదరదు. అలా తాగాలనుకుంటే నేరుగా ఫైవ్ స్టార్ హోటళ్లకెళ్లాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉమెన్ చాందీ నేతృత్వంలోని కేరళ సర్కారు ప్రతిపాదించిన కొత్త మద్యం పాలసీకే సుప్రీంకోర్టు ఓటేసింది. నేటి ఉదయం ఈ విషయంలో తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం, కేరళ బార్ హోటల్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అసలు విషయమేంటంటే, కేరళవ్యాప్తంగా సర్కారు ఏర్పాటు చేసిన వైన్ షాపుల్లో మద్యం లభిస్తుంది. అయితే సదరు మద్యాన్ని బయటే తాగేందుకు అప్పటిదాకా అందుబాటులో ఉన్న బార్లను ప్రభుత్వం రద్దు చేసింది. బార్ ను ఏర్పాటు చేయాలంటే ఫైవ్ స్టార్ హోటల్ స్థాయి ఉండాలని ఆంక్షలు విధించింది. సర్కారు అమల్లోకి తెచ్చిన కొత్త మద్యం పాలసీ ప్రకారం రాష్ట్రంలో కేవలం 24 ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బార్లు ఉంటాయి. మిగిలినవన్నీ అప్పటికే రద్దయ్యాయి. అయితే అప్పటిదాకా బార్లను ఏర్పాటు చేసి బాగా సంపాదించిన చిన్న బార్ల యజమానులు సర్కారు తమ పొట్ట కొడుతోందని ఆందోళనకు దిగారు. సర్కారు వెనకడుగు వేసేందుకు ససేమిరా అంది. దీంతో బార్ హోటల్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనకే మొగ్గు చూపుతూ అసోసియేషన్ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో అసోసియేషన్ చివరాఖరు యత్నంగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును బలపరుస్తూ కేరళ కొత్త మద్యం పాలసీకి పచ్చజెండా ఊపింది.

  • Loading...

More Telugu News