: ముస్లింలను వివాహం చేసుకున్నప్పటికీ మతం మాత్రం మారద్దు: హిందూ యువతులకు భజరంగ్ దళ్ సలహా
హిందూ యువతులు ముస్లింలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మతం మారవద్దని భజరంగ దళ్ సూచించింది. నిజమైన ప్రేమ మత మార్పిడిని ఎందుకు కోరుతుందని భజరంగ దళ్ ఉత్తరప్రదేశ్ కన్వీనర్ బాల్ రాజ్ దుగ్గర్ ప్రశ్నించారు. లవ్ జీహాద్ లో భాగంగానే హిందూ అమ్మాయిలను ముస్లింలు ప్రేమ పేరుతో వంచిస్తున్నారని ఆరోపించిన ఆయన, "ముస్లిం యువకులు హిందూ యువతిని వివాహమాడిన తరువాత మతం మారాలని ఎందుకు కోరుతున్నారు? వివాహాల తరువాత మత మార్పిడులపై నిషేధం విధించాలని మేము రాష్ట్రపతిని కోరుతాం" అని ఆయన అన్నారు. మతమార్పిడులపై నిషేధం అమలైతే, ప్రజల హక్కులు పరిరక్షింపబడటంతో పాటు లవ్ జీహాద్ కు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. ఓ హిందువుల ఇంట్లో అద్దెకుంటున్న మహమ్మద్ ఆసిఫ్ (40) అనే వ్యక్తితో కలసి, ఆ ఇంటి అమ్మాయి (22) పారిపోవడంపై స్పందించిన దుగ్గర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ యువతి లవ్ జీహాద్ కు బలికారాదని కోరారు.