: మళ్లీ జనంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి... విభజన వల్ల నీటి సమస్య వచ్చిందని వ్యాఖ్య
ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చరిత్ర పుటలకెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు జనంలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ఆయన గళం విప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిన్న రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రాత్రి అక్కడే మీడియా సమావేశం పెట్టి మరీ మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్లే నీటి సమస్య ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టం జరుగుతుందని తాను ముందే చెప్పినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల్లో తాగు నీటికే కాక సాగు నీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు లేకపోలేదన్న ఆయన కరవు తరహా పరిస్థితి ఎదురుకానుందని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలు కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడితేనే, ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా విషయాలు మాట్లాడాలని ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై నోరు విప్పుతానని కూడా ఆయన ప్రకటించారు.