: 11వ అంతస్తు పైనుంచి కిందపడుతున్న మహిళను పట్టుకోబోయిన యువకుడు!
పదకొండవ అంతస్తు పైనుంచి కింద పడబోతున్న ఒక మహిళను పట్టుకుబోయిన ఒక యువకుడికి గాయాలైన సంఘటన చైనాలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23వ తేదీన సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ లో ఉన్న ఎన్షీ సిటీలో ఫెంగ్ నింగ్ అనే యువకుడు అక్కడి రెస్టారెంట్ లోంచి బయటకు వస్తున్నాడు. సమీపంలో ఉన్న ఒక నివాస భవనం నుంచి పెద్దగా అరుపులు, కేకలు పెడుతున్న ఒక గొంతు విన్పించింది. అతను పరీక్షగా చూశాడు. 11వ అంతస్తు కిటికీకి వేలాడుతున్న ఒక మహిళను గమనించాడు. ఆ భవనం కింద కొంతమంది స్థానికులు ఆ మహిళను చూస్తూ నిలబడి ఉన్నారు. వెంటనే ఆ భవనం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. పైనుంచి కిందపడేందుకు సిద్ధంగా ఉన్న ఆ మహిళను పట్టుకునేందుకు అతను రెండు చేతులు చాచి సంసిద్ధమవుతుండగా... ఆమె అతని చేతుల మీదుగా కింద పడింది. ఆ బరువుకి అతను కూడా కింద పడ్డాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. ఈ సంఘటనలో ఫెంగ్ నింగ్ మోకాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే, అన్ని అంతస్తుల పై నుంచి కిందపడ్డ మహిళ మాత్రం ప్రాణాలు వదిలింది. కాగా, ఫెంగ్ నింగ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫెంగ్ నింగ్ మాట్లాడుతూ, ఆ మహిళను కాపాడలేకపోయినందుకు తనకు చాలా అవమానంగా ఉందని అన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.