: 'డెల్' కొనుగోలు ఆలోచనను విరమించుకున్న టీసీఎస్!


పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసి విక్రయిస్తున్న డెల్ సంస్థ ఐటీ సేవల విభాగ అనుబంధ కంపెనీ పెరాట్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసే ఆలోచనను టీసీఎస్ విరమించుకున్నట్టు తెలుస్తోంది. రెండు కంపెనీల మధ్యా పలు దఫాలుగా చర్చలు సాగగా, పెరాట్ కు చెల్లించాల్సిన ధర వద్ద విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. టీసీఎస్ తరఫున సీఈఓ ఎన్ చంద్రశేఖరన్, విలీనాల విభాగం హెడ్ దేబాశిష్ పొద్దార్ లు స్వయంగా చర్చల్లో పాల్గొన్నారని, ధర సమస్యలతో వెనక్కు తగ్గామని, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో అధికారికంగా స్పందించేందుకు మాత్రం ఇరు కంపెనీలూ అంగీకరించలేదు. కాగా, టీసీఎస్ తో డీల్ కుదరకుంటే పెరాట్ సిస్టమ్స్ ను చేజిక్కించుకునేందుకు కాగ్నిజంట్, ఎన్టీటీ డేటా, అటోస్ తదితర సంస్థలు ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. పెరాట్ కు కనీసం 5 బిలియన్ డాలర్లు (రూ. 33 వేల కోట్లు) ధర పలుకుతుందని డెల్ భావిస్తుండగా, టీసీఎస్ రూ. 28 వేల కోట్ల వరకూ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News