: 2015లో 14 శాతం తగ్గిన క్రైం రేట్: హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో నేరాలపై పోలీసులు ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ ఏడాది క్రైం రిపోర్టును నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 2015లో నేరాల సంఖ్య తగ్గిందని, 14 శాతంగా క్రైం రేట్ నమోదైందని మీడియా సమావేశంలో చెప్పారు. అయితే చాలావరకు చైన్ స్నాచింగ్ లు తగ్గాయన్నారు. రూ.1.60 కోట్ల విలువైన సొత్తు చైన్ స్నాచింగ్ జరిగితే, రూ.కోటి విలువైన సొత్తును రికవరీ చేశామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి రూ.37 కోట్లు వసూలైందన్నారు. ఇక నగరంలో 14 నిర్భయ కేసులు నమోదైతే, షీ టిమ్స్ కి 1,100 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. మహిళలపై వేధిపుల కేసులు 2,244 నమోదయ్యాయని, వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని ప్రకటించారు. నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయని, ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని మహేందర్ రెడ్డి తెలిపారు.