: కాంగ్రెస్ అధినేత్రిపై సొంత పత్రిక విమర్శనాత్మక కథనాలు... నెహ్రూపై కూడా!


గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నేడు 131వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్ర్య సంగ్రామంలో ముందుండి పోరాడటమే కాక యావత్తు దేశాన్ని పోరు బాట పట్టించిన ఆ పార్టీ, కాల క్రమేణా పెను విమర్శలను ఎదుర్కొంది. నాలుగేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, నాడు ఆ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ‘సాక్షి’ పత్రిక సోనియా గాంధీపై విమర్శనాత్మక కథనాలు రాసింది. దీంతో వైఎస్ జగన్ ఏకంగా పార్టీ నుంచే బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా ఆ పార్టీ పత్రిక ‘కాంగ్రెస్ దర్శన్’ అధినేత్రి సోనియా గాంధీపైనే కాక భారత ప్రప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కూడా విమర్శలు గుప్పించింది. మహారాష్ట్ర నుంచి వెలువడుతున్న ఈ పత్రికలో ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వరుసగా వచ్చిన కథనాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ పార్టీ మరాఠా శాఖ విపక్షాలకు సమాధానాలు చెప్పలేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. సోనియా గాంధీ తండ్రిని ఇటలీలో ఫాసిస్ట్ ముఠా సభ్యుడిగా అభివర్ణించిన ఆ పత్రిక, పార్టీ సభ్యత్వం తీసుకున్న 62 రోజుల్లోనే సోనియా పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారని రాసింది. అంతేకాక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా విఫలమయ్యారని విమర్శించింది. ఇక నెహ్రూ విషయానికి వస్తే... నాటి ఉప ప్రధానిగానే కాక కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను నెహ్రూ పెడచెవిన పెట్టారని ఆరోపించింది. నాడు పటేల్ సూచనలను పాటించి ఉంటే, ప్రస్తుతం కాశ్మీర్ లో నిత్యం అగ్గి రాజుకుని ఉండేది కాదని పేర్కొంది. ఈ కథనాలపై ఆ పత్రిక ఎడిటర్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కాస్తంత వేడి తగ్గించే విధంగా ప్రకటనలు చేశారు. పత్రిక సంపాదకుడి హోదాలో ఈ విషయంపై దృష్టి సారించానని, ఈ కథనాలు తప్పేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News