: విజయవంతమైన కడప స్పెషల్ పార్టీ పోలీసుల ఆపరేషన్!
ఎంతమందిని అరెస్ట్ చేసినా ఆగని శేషాచలం ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు కడప స్పెషల్ పార్టీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. తామందుకున్న విశ్వసనీయ సమాచారంతో ఢిల్లీ చేరుకున్న కడప పోలీసులు ముగ్గురు చైనీయులు సహా నలుగురిని అరెస్ట్ చేసి, రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వారి నుంచి వచ్చిన సమాచారంతో ఈ ఉదయం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కుర్రపల్లి వద్ద ఐదురుగు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 60 దుంగలను, నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీతారాంపురం మండలంలోని ఓ ప్రాంతంలో సేకరించి పెట్టిన దుంగలను తీసుకువెళ్లేందుకు వీరు వచ్చారని, వీరిలో ముగ్గురు తమిళనాడు వాసులని వివరించాయి. మరో నిందితుడు పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నకిలీ కరెన్సీ నోట్లు ఉండటంతో, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై విచారిస్తున్నట్టు వివరించారు.