: సిగరెట్లు ఊదేస్తున్న మహిళల సంఖ్య రెట్టింపు!
భారత్ లో ధూమపానం చేస్తున్న వారి సంఖ్య ఓ వైపు తగ్గుతుంటే, సిగరెట్లు ఊదేస్తున్న మహిళల సంఖ్య మాత్రం శరవేగంగా పెరుగుతోందట. గడచిన రెండేళ్లలోనే దేశంలో ధూమపాన ప్రియుల సంఖ్య 2 శాతం మేర తగ్గిపోయింది. అదే సమయంలో సిగరెట్ స్మోకింగ్ అలవాటు చేసుకుంటున్న మహిళల సంఖ్య మాత్రం గడచిన 32 ఏళ్లలో రెట్టింపు అయ్యిందట. దీంతో ప్రస్తుతం ఫిమేల్ స్మోకర్ల సంఖ్యలో అమెరికా తర్వాత స్థానం భారత్ దేనట. ఇదేదో ఏ సర్వే సంస్థో చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన నమ్మలేని నిజం. 2013-14 ఏడాదిలో దేశంలో 101.8 బిలియన్ల సిగరెట్లను మన ధూమపాన ప్రియులు ఊదేయగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో (2014-15)లో ఈ సిగరెట్ల సంఖ్య 93.2 బిలియన్లకు తగ్గింది. ఇక మహిళా ధూమపానప్రియుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 1980లో దేశంలో 53 లక్షల మంది మహిళా స్మోకర్లుంటే, 2012లో వీరి సంఖ్య రెట్టింపు కంటే దాటిపోయి 1.27 కోట్లకు చేరింది.