: ఎర్రవల్లి గగనతలంలో ప్రణబ్ హెలికాప్టర్... యాగశాలపై మంటలతో దిగకుండానే వెనక్కు!
విశ్వశాంతి, తెలంగాణ సస్యశ్యామలాన్ని కాంక్షిస్తూ తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన అయుత మహా చండీయాగం నిన్నటితో ముగిసింది. ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన యాగానికి దాదాపు 10 లక్షల మంది ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. చివరి రోజైన నిన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా యాగానికి హాజరుకావాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం సమయంలో యాగశాలలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రపతి పర్యటనను రద్దు చేసేసింది. నిన్న మధ్యాహ్నం దాదాపు 1.10 గంటల సమయంలో మూడు హెలికాఫ్టర్లతో కూడిన కాన్వాయ్ లో ప్రణబ్ యాగస్థలికి చేరుకున్నారు. ప్రణబ్ హెలికాప్టర్లు మరికాసేపట్లో అక్కడ ల్యాండవుతాయనగా, అగ్ని ప్రమాదం సంభవించింది. పైనుంచే మంటలను గమనించినప్పటికీ హెలికాప్టర్లు ల్యాండయ్యేందుకు కిందనుంచి గ్రీన్ సిగ్నల్ కోసం పైలట్లు ఎదురుచూశారు. అయితే అగ్ని ప్రమాదం నేపథ్యంలో కిందనున్న సిబ్బంది హెలికాప్టర్ల ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో గగనతలం నుంచే ప్రణబ్ వెనుదిరిగివెళ్లిపోయారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకున్న వెంటనే గవర్నర్ కు విషయం చెప్పిన ప్రణబ్ తన తరఫున యాగానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హుటాహుటిన యాగక్షేత్రానికి వెళ్లారు.