: డైలాగులు చెప్పడానికి ఇది ‘లెజెండ్’ కాదు: జగపతిబాబు
డైలాగులు చెప్పడానికి ఈ సినిమా ‘లెజెండ్’ చిత్రం కాదని.. ఇది సుకుమార్ మూవీ అని..వేరే స్టైల్లో ఉంటుందని హీరోగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం విలన్ గా మంచి ఫామ్ లో ఉన్న ప్రముఖ నటుడు జగపతిబాబు అన్నారు. 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను లాంచ్ చేయడానికి ముందు ఆయన మాట్లాడుతూ, "నాన్నకు ప్రేమతో' చిత్రం ఆడియో రిలీజ్ సాయంత్రం అయితే.. పాటలు పొద్దున్నే హిట్టయ్యాయి. దేవీ ఉంటే సినిమాకే కాదు, నాక్కూడా లైఫ్ ఇస్తాడనే నమ్మకం ఉంది. ఈ చిత్ర యూనిట్ మొత్తం మిత్రులైపోయారు. డబ్బింగ్ చెప్పిన తర్వాత ఈ సినిమా దమ్ము ఏంటో నాకు అర్థమైంది. సార్..మిమ్మల్ని చూస్తుంటే ఇంకా హీరో లాగా కనపడుతున్నారు.. మిమ్మల్ని విలన్ గా ఎలా చూపించాలంటూ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం షూటింగ్ లో నాతో అన్నాడు. తారక్ ఎనర్జీ లెవెల్స్ వేరు. అల్లరి బాగా చేస్తాడు. ఎవరినీ మాట్లాడనివ్వడు. అతనే మాట్లాడేస్తాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత నేను యాక్టు చేయాల్సి వచ్చింది. హ్యూమన్ బీయింగ్స్ లో ఎవర్ని వెధవ అని నేననుకుంటానో అటువంటి పాత్రనే నేను చెయ్యాల్సి వచ్చింది. ఈ పాత్రను మీరు ఎలా ఆదరిస్తారో మరి!" అని జగపతిబాబు అన్నారు.