: ఇండియాతో చర్చలతో పెద్దగా ప్రయోజనాలుండవు: పాకిస్థాన్
వచ్చే నెలలో ఇండియాతో జరిగే కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి ప్రయోజనాలను ఆశించలేమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ సలహాదారు సత్రాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ అధికారిక రేడియో ప్రతినిధితో మాట్లాడిన ఆయన, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నెలకొనే శాంతి ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అది దీర్ఘకాల ప్రక్రియని, ఒక్కరోజు చర్చలతో ఏమీ ఒరగబోదని అభిప్రాయపడ్డారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తొలగే దిశగా ఇరు దేశాలూ కృషి చేయాలని సూచించారు. లాహోర్ లో భారత ప్రధాని దిగడం అభినందనీయమని అన్నారు. కాగా, జనవరిలో ఇస్లామాబాద్ లో ఇరు దేశాల విదేశాంగ శాఖ స్థాయి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే.