: అమరావతి మాస్టర్ ప్లాన్ వచ్చేసింది!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ను సీఆర్డీఏ వెబ్ సైట్ ద్వారా ఏపీ సర్కారు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 7 పీడీఎఫ్ ఫార్మాట్ లోని ఫైళ్లను సీఆర్డీఏ లోని 'http://crda.ap.gov.in/APCRDA/Userinterface/HTML/masterplansNew.htm' వెబ్ పేజీలో అప్ లోడ్ చేసింది. వీటిల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని పరిధిలోకి వచ్చే మండలాల వివరాలను, రాజధాని మాస్టర్ ప్లాన్ హై రెజల్యూషన్ పిక్చర్ లనూ ఉంచింది. వీటిపై ప్రజలకు అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా... అంటే, జనవరి 24లోగా తెలియజేయాలని పేర్కొంది. అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా లేదా తెలియజేయవచ్చని, సీఆర్డీయే చిరునామాకు పోస్టు కూడా చేయవచ్చని వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఫైళ్లను ఉంచింది. కాగా, ఈ మాస్టర్ ప్లాన్ వివరాల ప్రకారం, కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి, బావులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, జీ కొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోటవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరుల్లపాడు, విజయవాడ అర్బన్, రూరల్, ఉయ్యూరు మండలాలను చేర్చారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే, అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెద్దకూరపాడు, పెద్దకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తెనాలి, చుండూరు, తుళ్ళూరు, వట్టి చెరకూరు, వేమూరు మండలాలను కలిపారు.