: క్యాంపులను వదిలి ఓటేసేందుకు ఊర్లకు చేరిన 'స్థానికులు'!


నేడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా, నిన్నటి వరకూ వివిధ పార్టీలు నిర్వహించిన క్యాంపుల్లో ఉన్న వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తిరిగి ఊర్లకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగనుండగా, 'నోటా' ఆప్షన్ సైతం అందుబాటులో ఉంటుందని భన్వర్ లాల్ వెల్లడించారు. 4 జిల్లాల్లో ఎన్నికలు జరుగనుండగా, 19 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని 19 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుండగా, ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు 5గురు బరిలో ఉండగా, 771 మంది ఓటేయనున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలకు 5గురు బరిలో ఉండగా, 1260 మంది, ఖమ్మంలో ఒక స్థానానికి 5గురు పోటీ పడుతుండగా, 726 మంది, నల్గొండలో ఒక స్థానానికి నలుగురు బరిలో నిలువగా, 1,110 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 30న కౌంటింగ్ జరుగనుంది.

  • Loading...

More Telugu News