: హైదరాబాదులో కల్తీ దాణా బాగోతం గుట్టురట్టు!
ప్రజలు ఉపయోగించే ఆహార ఉత్పత్తులే కాకుండా, చివరకు కోళ్లకు ఆహారంగా పెట్టే దాణా కూడా కల్తీ అయిపోయింది. తాజాగా, హైదరాబాద్ బాలాపూర్ లోని సాయినగర్ లో కల్తీ దాణా బాగోతం ఒకటి గుట్టురట్టయింది. నకిలీ దాణా గోడౌన్ పై 'ఎస్.ఓ.టి' పోలీసులు దాడి చేశారు. రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లపై నగర పోలీసులు కన్నేయడంతో అసలు విషయం బయటపడింది. ఇందులో భాగంగానే ఈ నకిలీ దాణా గోడౌన్ పై వారు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయినగర్ లో రేకుల షెడ్డులో ఒక గోడౌన్ ను ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యంలో సన్నని ఇసుక, తవుడును కలిపి నకిలీ దాణాను ఇక్కడ తయారు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ సహా పలు పట్టణాలకు దీనిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు సుమారు రెండు వందల బస్తాల దాణాను విక్రయిస్తామని నకిలీ దందా నిర్వాహకులు పోలీసుల విచారణలో చెప్పారు. ఈ నకిలీ దాణాను తయారు చేసే వ్యక్తులు వారానికొకసారి ఇక్కడికి వస్తుంటారని సమాచారం. కాగా, భారీ మొత్తంలో కల్తీ దాణా, రేషన్ బియ్యం, తవుడు, ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.