: విజయవాడలో హోటల్ సిబ్బందిపై రౌడీమూకల దౌర్జన్యం!
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రౌడీమూకలు విరుచుకుపడ్డాయి. స్థానిక వన్ టౌన్ పంజా సెంటర్ లో రౌడీలు వీరంగం సృష్టించారు. ఒక హోటల్ సిబ్బందిపై మారణాయుధాలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. హోటల్ మూసేస్తున్న సమయంలో రావడమే కాకుండా, కిచిడిలోకి గోంగూర చట్నీ, పెరుగు చట్నీ లేదన్నందుకు సదరు హోటల్ సిబ్బందిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అక్కడ పనిచేసే ఈశ్వర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రౌడీ మూకను అడ్డుకున్న యజమానిపై కూడా వారు తెగబడ్డారు. కాగా, ఈ రౌడీ మూకలు దౌర్జన్యానికి పాల్పడుతున్న సంఘటనలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.