: ‘స్థానిక’ ఓటర్లకు పదిహేనురోజుల పండగ!
తెలంగాణలోని 6 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ ఓటర్లను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఆయా పార్టీలు క్యాంపులు ఏర్పాటుచేసి తమకు అనుకూలమైన ఓటర్లను అక్కడికి తరలించారు. వారిని పలు పర్యాటక ప్రదేశాలకు తిప్పుతున్నారు. సుమారు 15 రోజులుగా దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని అనేక పర్యాటక ప్రాంతాల్లో ఈ పదిహేను రోజుల పండగను స్థానిక ఓటర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం పోలింగ్‌లో పాల్గొనే విధంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఓటర్లందరినీ నేడు హైదరాబాద్‌కు తరలించారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ఆయా జిల్లాలకు ఆదివారం ఉదయానికి వారిని చేరవేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా, స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలోని మొత్తం 12 స్థానాలకు గాను ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ ఒక్కో స్థానంతో పాటు కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్గొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఈ 30న ఉంటాయి.