: రాహుల్ గాంధీకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సూచనలు
పార్లమెంటులో ఎక్కువ విషయాలపై మరింత ఎక్కువగా మాట్లాడాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ సూచించారు. అలా మాట్లాడగలిగినప్పుడే బీజేపీపై ఒత్తిడి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఏ అంశంపైన అయినా ఒకటి రెండు వ్యాఖ్యలు మాట్లాడితే సరిపోదని, ఒక గంటలో ఏకధాటిగా 45 నిమిషాలు మాట్లాడగలగాలని చెప్పారు. అదేవిధంగా రాహుల్ తన బాడీలాంగ్వేజీని కూడా మెరుగుపరుచుకోవాలని చవాన్ సలహా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు పార్లమెంటులోనే మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి, సమయాన్ని ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలపై చర్చించినప్పుడే వారి సమస్యలను మనం పరిష్కరించగలమని పేర్కొన్నారు.