: డీడీసీఏ అవకతవకల్లో జైట్లీ ప్రమేయం లేదు!... తేల్చిచెప్పిన ‘త్రీమెన్ కమిటీ’
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ వార్త కాస్తంత ఊరట కలిగించేదే. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం విచారణ పర్వాన్ని కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలంటూ మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో వన్ మన్ కమిషన్ ను ఏర్పాటు చేసిన కేజ్రీ సర్కారు, అంతకుముందే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది. సదరు త్రిమెన్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో అసలు జైట్లీ ప్రస్తావనే లేదట. జైట్లీ హయాంలోనే అవకతవకలు జరిగాయని చెప్పిన సదరు కమిటీ, వాటిలో జైట్లీకి ప్రమేయం ఉందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదట. దీంతో గడచిన వారం పది రోజులుగా ఆప్ సర్కారు వరుస ఆరోపణలతో సతమతమైన జైట్లీ ఈ నివేదికతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.