: ఇక విదేశాంగ శాఖ కార్యదర్శుల వంతు... 15న ఇస్లామాబాదులో భారత్, పాక్ చర్చలు
సుదీర్ఘ కాలంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య నిలిచిపోయిన చర్చల ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. వాతావరణ సదస్సు కోసం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కు వెళ్లిన ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు ఆత్మీయంగా పలకరించుకున్నారు. షేక్ హ్యాండులతో పాటు ఏకాంతంగా కూర్చుని ముచ్చటించుకున్నారు. వెనువెంటనే ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియకు తెర లేచింది. ప్రధానుల భేటీ తర్వాత ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు బ్యాంకాక్ లో రహస్య భేటీ నిర్వహించారు. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాదులో పర్యటించారు. తాజాగా నిన్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనంలో భాగంగా అందరికీ షాకిస్తూ నరేంద్ర మోదీ పాక్ నగరం లాహోర్ లో ల్యాండయ్యారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంతూరు రాయ్ విండ్ లో జరిగిన ఆయన మనవరాలి పెళ్లి వేడుకకు హాజరై నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. వెనువెంటనే ఇరు దేశాల మధ్య అసలు సిసలైన చర్చలకు కార్యాచరణ ప్రారంభమైంది. వచ్చే నెల 15న ఇస్లామాబాదులో ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీకి ఇరు దేశాలు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు ప్రారంభమైతే, ఇరు దేశాల మధ్య అసలైన చర్చలు మళ్లీ పునరుద్ధరణకు నోచుకున్నట్టే.