: ఏవోబీలో హైటెన్షన్!... బాక్సైట్ కు వ్యతిరేకంగా మావోల బంద్, భారీగా మోహరించిన పోలీసులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో నిన్న రాత్రి నుంచే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి జీవోను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, గిరిజనుల వ్యతిరేకతతో వెనకడుగు వేసింది. అయినా జీవోను మాత్రం ఉపసంహరించలేదు. దీంతో ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా బాక్సైట్ తవ్వకాలు జరగడం ఖాయమేనని భావిస్తున్న నిషేధిత మావోయిస్టులు నేడు ఏవోబీ బంద్ కు పిలుపునిచ్చారు. మావోయిస్టుల పిలుపుకు గిరిజనుల నుంచి భారీ స్పందనే రానుంది. దీంతో ఏవోబీలో నేడు అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే మావోల ప్రాబల్యానికి చెక్ చెప్పేలా, బంద్ ను నిష్ఫలం చేసేందుకు నిన్న రాత్రి నుంచే ఏపీ, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. ఏవోబీలో పెద్ద ఎత్తున కవాతు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.